15-07-12

ఫేక్ ఐడెంటిటి-5


వాక్యాల్ని విరిచి,అర్ధాన్ని మార్చి
భావానికి కోతపెట్టి
అసలు విశయం దాచిపెట్టి
మళ్ళీ మళ్ళీ తప్పు చేయకుండా..


వాంచని ప్రేమని,ఊహని నిజమని 
పిరికితనాన్ని అభిమానమని
చేతగానితనాన్ని సహనమని
పదే పదే అబద్ధమాడకుండా..



వర్షాన్ని,ప్రవాహాన్ని,సంద్రాన్ని
చుక్కల్ని,వెన్నెల్ని,ఆకాశాల్ని
పదాలకోసం యాచించకుండా
ప్రపంచాన్ని వంచించకుండా


మాటలకి,చూపులకి,నవ్వులకి
అన్నింటిని మించగల నటనకి
పువ్వుల్నో గువ్వల్నో బలిపెట్టకుండా
పోలికలు మాళికలు అసలే లేకుండా



ఇవాళ నీ గురించి 
ఏదన్నా రాస్తాను.
చివరగా ఒకసారి
నిజాల్నే రాస్తాను.




నీ అసంబద్ధ నిర్ణయాల్ని ఎత్తిచూపేలా
ఆశనిరాశల్ని తప్పుపట్టేలా
ఆవేశాన్ని,అసమానతని గుర్తుచేసేలా
ఆలోచననో,ఆత్మీయతనో పంచి ఇచ్చేలా



నా కపటాన్ని,కల్మషాన్ని ప్రతిఫలించేలా
కారణాల్ని కల్లలని నిరూపించేలా
కనిపించని  నన్ను ఆవిష్కరించేలా
కవితల్లో కవితై ఒదిగిపోయేలా


నువ్వు నేను కలవలేమని తెలిసి
కాల్చేస్తున్న కలల్లో దహించుకుంటు
నీ పిలుపు అందదని తెలిసి
పగిలే గుండెలో చీలికనవుతు

నీకోసం మిగుల్చుకుంది
నాలో నేను రాల్చుకుంది
నిజాన్ని తెగించి చెప్పేది
నిన్ను నన్ను ముగించేది   


నువ్వెప్పటికీ చదవలేవని తెలిసీ
తప్పకుండా నిజం రాస్తాను.
ఎన్నటికి పూర్తవదని తెలిసీ
మరోసారి ప్రయత్నిస్తాను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి