15-07-12

ఫేక్ ఐడెంటిటి-6


అలల్ని లెక్కిస్తూ నేను
అనంతాన్ని ఊహిస్తు నువ్వు


నువ్వు ఆవహించుకునే సంద్రంలో
--నేనెందుకుండనో అర్ధం కాదు.

నెమ్మదిగా ఉండే హృదయంలో
ఆ వేగం ఎక్కడిదో అర్ధం కాదు.
-

ఎందుకో


నేను ఖాళీ అవ్వాలని ప్రయత్నించే కొద్ది
నువ్వు కావాలని చాటుగా ఎండిపోతావు.

నువ్వు ప్రవాహాన్ని గుర్తించలేదనే పిచ్చి భ్రమలో
తీరాలు,నావలు మోసపోతాయి.


నా సందేశం  అందిన  పున్నమి రోజు కూడ
నువ్వెందుకో అసలే పోటెత్తవు.

 రిక్త ప్రవాహంగా మారలేని అశక్తత
నిరాశగ ఇద్దర్ని నిందిస్తుంది.

-

నా వెక్కిరింపుకి రోజు బలైపోతున్న
నీ అనంతపు ఖాళీతనం సాక్షిగా


ఇవాళ నీకో నిజం చెప్పనా?


నీరు తియ్యగా ఉండదని తెలిసీ
నిన్నిష్టపడ్డాను.


నువు ఎండిపోతున్నావని ఇంకా
ఇష్టపడుతూనే ఉన్నాను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి