08-07-12

నువ్వు



నీ కన్నులు ఆకాసములు
వాలినపుడు సందె పొద్దులు
నీలాల్లో నీలి మేఘములు
రాలినపుడు స్వాతిచినుకులు.

నీ నగవులు నయగారాలు
జారినపుడు జలపాతాలు
నీ పెదవులు నీలిసంద్రములు
కొరికినపుడు స్వాతిముత్యములు.

నీ ముద్దులు మంచు జల్లులు
కురిసినపుడు విరహ ప్రవాహం
నీ స్పర్శలు దూరపు దీవులు
వేచినపుడు వింత ప్రయాణం.

నీ కౌగిలి కలలకులోగిలి
దక్కినపుడు తనువొక కడలి
నీ చెక్కిలి వజ్రపు ధూళి
చిక్కినపుడు పున్నమికేళి.

నీ హృదయపు గులాభి పూలు
పూసినపుడు వేకువ నేను
నీ మనసున మల్లెల గాలులు
వీచినపుడు వెన్నెల నేను.

నీ పరువము మధుర పుష్పము
విరిసినపుడు తుమ్మెద నేను
నీ ప్రణయపు మధువుల కావ్యం
రాసినపుడు రసకవి నేను.