15-07-12

ఫేక్ ఐడెంటిటి-2


నువ్వు తీరంలో తీరిగ్గా తిరిగేస్తుంటే
నే చెరువు గట్లపై అడుగులేసాను

నీ సంద్రంలో ముత్యాలు,గవ్వలు,శంఖాలు..
నా చెరువులో ఖాళీ ఖాళీ నత్తగుల్లలు..


అక్షరాలో,ఆలోచనలో ఎవరు చెప్పరో 
నీకు నాకు  పోలిక ఉందనుకున్నాను.


నిన్ను కలవాలంటే 
నదినో ప్రవాహాన్నో కావాలని
నిన్నటిదాక గుర్తురాలేదు.


నిరంతరం హోరెత్తే నీకు
నిమ్మలంగా గాలికూగే నాకు
నిజమే బహుశా పోలికే లేదు.


-


నువ్వు నీలాకాశాల్ని కప్పుకున్నప్పుడు
నేను మేఘాల్ని తారల్ని చదువుకున్నాను.

నీకు డాల్ఫిన్లు,టూనాలు,సమస్త కాంతిచరాలు
నాకు జల్లెలు,పరకలు,నల్ల చేపలు,తెల్ల రొయ్యలు 


అవసరమో,అవకాశమో ఏది సరేనందో
నీతో పోటీకి ఒప్పుకున్నాను.



నిన్ను గెలవాలంటే
బలం బలగం ఉండాలని
నిజంగా అపుడెందుకో అనిపించలేదు.


అలల్ని విసురుతు కవ్వించే నీకు
సొగసుగా కదులుతు ఆహ్వానించే నాకు
నిజమే బహుశా పోలికే లేదు.


-


అయిందేదో అయిపోయింది.
ఇప్పుడు అనుకుని మాత్రం ఏం లాభం?


నీ అడ్రస్ అలస్కాకి మారిపోయింది.
నీ మతం పసిఫిక్ కి పారిపోయింది.


నీ పాత సందేశాలు సుడి తిరిగినపుడో
ఆ చివరి నిమిషాలు కదిలించినపుడో

నా ఆశ అగాధంలోకి జారిపోతూ
నిన్ను నన్ను ప్రశ్నిస్తోంది!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి