15-07-12

ఫేక్ ఐడెంటిటి-6


అలల్ని లెక్కిస్తూ నేను
అనంతాన్ని ఊహిస్తు నువ్వు


నువ్వు ఆవహించుకునే సంద్రంలో
--నేనెందుకుండనో అర్ధం కాదు.

నెమ్మదిగా ఉండే హృదయంలో
ఆ వేగం ఎక్కడిదో అర్ధం కాదు.
-

ఎందుకో


నేను ఖాళీ అవ్వాలని ప్రయత్నించే కొద్ది
నువ్వు కావాలని చాటుగా ఎండిపోతావు.

నువ్వు ప్రవాహాన్ని గుర్తించలేదనే పిచ్చి భ్రమలో
తీరాలు,నావలు మోసపోతాయి.


నా సందేశం  అందిన  పున్నమి రోజు కూడ
నువ్వెందుకో అసలే పోటెత్తవు.

 రిక్త ప్రవాహంగా మారలేని అశక్తత
నిరాశగ ఇద్దర్ని నిందిస్తుంది.

-

నా వెక్కిరింపుకి రోజు బలైపోతున్న
నీ అనంతపు ఖాళీతనం సాక్షిగా


ఇవాళ నీకో నిజం చెప్పనా?


నీరు తియ్యగా ఉండదని తెలిసీ
నిన్నిష్టపడ్డాను.


నువు ఎండిపోతున్నావని ఇంకా
ఇష్టపడుతూనే ఉన్నాను.

ఫేక్ ఐడెంటిటి-5


వాక్యాల్ని విరిచి,అర్ధాన్ని మార్చి
భావానికి కోతపెట్టి
అసలు విశయం దాచిపెట్టి
మళ్ళీ మళ్ళీ తప్పు చేయకుండా..


వాంచని ప్రేమని,ఊహని నిజమని 
పిరికితనాన్ని అభిమానమని
చేతగానితనాన్ని సహనమని
పదే పదే అబద్ధమాడకుండా..



వర్షాన్ని,ప్రవాహాన్ని,సంద్రాన్ని
చుక్కల్ని,వెన్నెల్ని,ఆకాశాల్ని
పదాలకోసం యాచించకుండా
ప్రపంచాన్ని వంచించకుండా


మాటలకి,చూపులకి,నవ్వులకి
అన్నింటిని మించగల నటనకి
పువ్వుల్నో గువ్వల్నో బలిపెట్టకుండా
పోలికలు మాళికలు అసలే లేకుండా



ఇవాళ నీ గురించి 
ఏదన్నా రాస్తాను.
చివరగా ఒకసారి
నిజాల్నే రాస్తాను.




నీ అసంబద్ధ నిర్ణయాల్ని ఎత్తిచూపేలా
ఆశనిరాశల్ని తప్పుపట్టేలా
ఆవేశాన్ని,అసమానతని గుర్తుచేసేలా
ఆలోచననో,ఆత్మీయతనో పంచి ఇచ్చేలా



నా కపటాన్ని,కల్మషాన్ని ప్రతిఫలించేలా
కారణాల్ని కల్లలని నిరూపించేలా
కనిపించని  నన్ను ఆవిష్కరించేలా
కవితల్లో కవితై ఒదిగిపోయేలా


నువ్వు నేను కలవలేమని తెలిసి
కాల్చేస్తున్న కలల్లో దహించుకుంటు
నీ పిలుపు అందదని తెలిసి
పగిలే గుండెలో చీలికనవుతు

నీకోసం మిగుల్చుకుంది
నాలో నేను రాల్చుకుంది
నిజాన్ని తెగించి చెప్పేది
నిన్ను నన్ను ముగించేది   


నువ్వెప్పటికీ చదవలేవని తెలిసీ
తప్పకుండా నిజం రాస్తాను.
ఎన్నటికి పూర్తవదని తెలిసీ
మరోసారి ప్రయత్నిస్తాను.

ఫేక్ ఐడెంటిటి-4



నేను నక్షత్రాల్ని ఏరుకుంటు
ఆకాశమంతా తిరుగుతాను.




నువ్వు చుక్కల్లోంచి ఉల్కల్లోకి
ఉల్కల్లోంచి గ్రహాల్లోకి
గ్రహాల్లోంచి శకలాల్లోకి
శకలాల్లోంచి వలయాల్లోకి




పిడికిట్లోకి రాకుండా
చలిస్తూనే ఉంటావ్.




తెలివిగా శూన్యంలో
శిధిలమవుతు,
కనపడని చీకట్లో
నవ్వుతుంటావ్.




-




నేను పావురాల్ని సృష్టిస్తు
ఇంద్రజాలం చేస్తాను.




నువ్వు సంగమాల్లోంచి సందేశాల్లోంచి
మనుషుల్లోంచి మనసుల్లోంచి
అక్షరాల్లోంచి అభిమానాల్లోంచి
ఊహల్ని,నన్ను చెరిపేస్తు చెరవేస్తు








టోపిలోనే దాక్కొని
రెక్కలన్నీ కోసేస్తావ్.




నా కళ్ళముందే
రక్తం చిందుతుంటే,
కారణాలు చూపిస్తూ
నిందలూ  వేస్తావ్
-




నిన్నెప్పటికి చూడలేనని
ఎందుకో బాధ లేదు.




ఎందుకని అడిగేంత
అవసరమూ లేదు.

ఫేక్ ఐడెంటిటి-3


సారో,గారో కావాలి నీకు.
మరి.. పేరెందుకు పెట్టుకున్నావ్?
అమ్మ, అక్క కావాలి నీకు.
మరి.. వయసెందుకు దాచుకుంటావ్?


ఇవాళ ఆడ మగ అందర్ని నిలదీస్తాను
అసలు పిలుపు ఏంటో తేల్చుకుంటాను.

-


మీరు అంటే 
దూరం పెరుగుతోందని ఒకరు..
నువ్వు అంటే
హద్దులు మీరుతున్నావని ఒకరు..



ఇవాళ అందర్ని పిచ్చిగా తిట్టేస్తాను.
ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తాను.

-


నేనేనో కాదో తెలీదు.
చూడకుంటే మనసూరుకోదు.
నావేనో కాదో తెలీదు.
వివరంలేందే నోట మాట రాదు.


ఇవాళ నిజంగా ఏదన్న తప్పు చేస్తాను.
ఒప్పని నిరూపించి తప్పుకుంటాను.


-

వాన సంద్రంలో కురిసినట్టు
ఉల్క తారల్లో రాలినట్టు
పుప్పొడి రెమ్మలపై జారినట్టు
నీడలు చెట్లపై వాలినట్టు



నాలోకి నేను గతిస్తుంటే
ఈ రోజు కూడా గడిచిపోయింది!

ఫేక్ ఐడెంటిటి-2


నువ్వు తీరంలో తీరిగ్గా తిరిగేస్తుంటే
నే చెరువు గట్లపై అడుగులేసాను

నీ సంద్రంలో ముత్యాలు,గవ్వలు,శంఖాలు..
నా చెరువులో ఖాళీ ఖాళీ నత్తగుల్లలు..


అక్షరాలో,ఆలోచనలో ఎవరు చెప్పరో 
నీకు నాకు  పోలిక ఉందనుకున్నాను.


నిన్ను కలవాలంటే 
నదినో ప్రవాహాన్నో కావాలని
నిన్నటిదాక గుర్తురాలేదు.


నిరంతరం హోరెత్తే నీకు
నిమ్మలంగా గాలికూగే నాకు
నిజమే బహుశా పోలికే లేదు.


-


నువ్వు నీలాకాశాల్ని కప్పుకున్నప్పుడు
నేను మేఘాల్ని తారల్ని చదువుకున్నాను.

నీకు డాల్ఫిన్లు,టూనాలు,సమస్త కాంతిచరాలు
నాకు జల్లెలు,పరకలు,నల్ల చేపలు,తెల్ల రొయ్యలు 


అవసరమో,అవకాశమో ఏది సరేనందో
నీతో పోటీకి ఒప్పుకున్నాను.



నిన్ను గెలవాలంటే
బలం బలగం ఉండాలని
నిజంగా అపుడెందుకో అనిపించలేదు.


అలల్ని విసురుతు కవ్వించే నీకు
సొగసుగా కదులుతు ఆహ్వానించే నాకు
నిజమే బహుశా పోలికే లేదు.


-


అయిందేదో అయిపోయింది.
ఇప్పుడు అనుకుని మాత్రం ఏం లాభం?


నీ అడ్రస్ అలస్కాకి మారిపోయింది.
నీ మతం పసిఫిక్ కి పారిపోయింది.


నీ పాత సందేశాలు సుడి తిరిగినపుడో
ఆ చివరి నిమిషాలు కదిలించినపుడో

నా ఆశ అగాధంలోకి జారిపోతూ
నిన్ను నన్ను ప్రశ్నిస్తోంది!!

ఫేక్ ఐడెంటిటి-1


నా మాటల్ని దాచుకోవాలనుకున్నావు..
మొదటి ప్రశ్నకే తడబడ్డాను..


గాజు పాత్ర పగిలిపోయింది.
అతికించే అవకాశం లేదు.
-


నా అక్షరాల్ని నింపుకోవాలనుకున్నావు..
దోసిట్లోకి ఆహ్వానించావు..


ప్రవాహం దారితప్పింది.
మళ్ళించే శక్తిలేదు.
-


నా హృదయాన్ని హత్తుకోవాలనుకున్నావు.
హృదయం నుండి పిలుపొచ్చింది..


నన్నెవరో బంధించారు.
విడిపించే మనుషుల్లేరు.
-


"ఐయామ్మ్ నాట్ ఫేక్ " అని అరవాలనుంది..
నువ్వు గుర్తొచ్చిన ప్రతిసారి!

08-07-12

నువ్వు



నీ కన్నులు ఆకాసములు
వాలినపుడు సందె పొద్దులు
నీలాల్లో నీలి మేఘములు
రాలినపుడు స్వాతిచినుకులు.

నీ నగవులు నయగారాలు
జారినపుడు జలపాతాలు
నీ పెదవులు నీలిసంద్రములు
కొరికినపుడు స్వాతిముత్యములు.

నీ ముద్దులు మంచు జల్లులు
కురిసినపుడు విరహ ప్రవాహం
నీ స్పర్శలు దూరపు దీవులు
వేచినపుడు వింత ప్రయాణం.

నీ కౌగిలి కలలకులోగిలి
దక్కినపుడు తనువొక కడలి
నీ చెక్కిలి వజ్రపు ధూళి
చిక్కినపుడు పున్నమికేళి.

నీ హృదయపు గులాభి పూలు
పూసినపుడు వేకువ నేను
నీ మనసున మల్లెల గాలులు
వీచినపుడు వెన్నెల నేను.

నీ పరువము మధుర పుష్పము
విరిసినపుడు తుమ్మెద నేను
నీ ప్రణయపు మధువుల కావ్యం
రాసినపుడు రసకవి నేను.